చెన్నై/ కోల్‌కతా, ఏప్రిల్ 23: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు జరిగిన ఒకే విడత ఎన్నికల్లో ఓటర్లు ఎంతో ఉత్సాహంతో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాల్లో 92.72 శాతం, తమిళనాడులో 85.14 శాతం పోలింగ్ నమోదైనట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయా రాష్ర్టాల్లో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ సహా పలు చోట్ల చెదురుమదురుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్‌లో ఏజేయూపీకి చెందిన హుమాయున్ కబీర్ అనుచరులు, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. అలాగే దక్షిణ దినాజ్పూర్లో బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.