(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నరేంద్ర మోదీ (Narendra Modi) పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా చేసిన సర్వేలోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. కరోనా మహమ్మారి అనంతరం బీజేపీ రెండో దఫా పాలనలో భారతీయ కుటుంబాల అప్పులు డబుల్ అయినట్టు తేలింది.
కరోనా సంక్షోభం తర్వాత భారతీయ కుటుంబాల వార్షిక రుణభారం.. ఆస్తుల సృష్టి కంటే డబుల్ అయ్యిందని ఆర్బీఐ తేల్చి చెప్పింది. ఆర్బీఐ డాటా ప్రకారం.. 2019-20లో భారతీయ కుటుంబాల అప్పులు రూ.7.5 లక్షల కోట్లుగా ఉంటే.. 2024-25లో అవి రూ.15.7 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంటే రుణాల పెరుగుదల 102 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో కుటుంబాల ఆస్తులు మాత్రం 48 శాతమే పెరుగుదలను నమోదు చేశాయి. 2019-20లో భారతీయ కుటుంబాలు తమ ఆర్థిక ఆస్తులలో రూ.24.1 లక్షల కోట్లను జోడించగా.. 2024-25 నాటికి అది రూ.35.6 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నది. ఈ మేరకు ఆర్బీఐ గణాంకాల్లో వెల్లడించింది. 2019లో జీడీపీలో 3.9 శాతంగా ఉన్న అప్పులు 2024-25లో 4.7 శాతానికి ఎగబాకాయి. 2019-20లో భారతీయ కుటుంబాలు జీడీపీలో 12 శాతం మేర ఆస్తులను కూడబెట్టగా.. 2024-25 నాటికి ఇది 10.8 శాతానికి తగ్గిపోయింది.

భారతీయ కుటుంబాలు పొదుపు చేస్తున్న ఆ కొంత మొత్తాన్ని ప్రధానంగా బ్యాంకు డిపాజిట్లుగా పెడుతున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. 2019-20లో ఇది 32 శాతంగా (రూ. 7.7 లక్షల కోట్లు) ఉండగా 2024-25 నాటికి 33.3 శాతానికి (రూ. 11.8 లక్షల కోట్లు) పెరిగిందని తెలిపింది. ఇక, ఇదే సమయంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఏకంగా 655 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. 2019-20లో 2.6 శాతంగా (రూ. 61,686 కోట్లు) ఉన్న మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు.. 2024-25 నాటికి 13.1 శాతానికి (రూ. 4.7 లక్షల కోట్లు) ఎగబాకినట్టు వివరించింది. డిజిటల్ యుగంలో భారతీయ కుటుంబాల్లో నగదు పొదుపు తగ్గినట్టు నివేదిక తెలిపింది. 2019-20లో 11.7 శాతంగా ఉన్న కరెన్సీ హోల్డింగ్.. 2024-25కు 5.9 శాతానికి పడిపోయినట్టు వివరించింది.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఖర్చులకు తగ్గట్టు పెరగని సగటు ఉద్యోగి వేతనం, దీనికి అదనంగా కొలువుల కోతలు, ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోతున్న అవినీతి వెరసి నరేంద్ర మోదీ పాలనలో సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆదాయం కంటే పౌరుల వ్యయం పెరిగిపోతుండటంతో భారతీయ కుటుంబాలు ఆస్తులు కూడబెట్టడం అటుంచితే వేగంగా అప్పులు చేసున్నట్టు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభం తర్వాత ఈ పరిస్థితులు మరింతగా దిగజారాయని విశ్లేషిస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నట్టు మండిపడుతున్నారు.
