న్యూఢిల్లీ, జూలై 3: నిందితులు అందరిపై మనీ లాండరింగ్ నేరారోపణలు నమోదైన అత్యంత అరుదైన కేసు ఇదేనని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ కోర్టులో వాదించింది. ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే ఎదుట చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ యంగ్ ఇండియన్‌కి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లబ్ధిదారులైన యజమానులని, ఇతర వాటాదారుల మరణానంతరం దీనిపై 100 శాతం ఆధిపత్యం సంపాదించారని ఆయన తెలిపారు.
ఏఐసీసీని నియంత్రించిన ఈ ఇద్దరు వ్యక్తులు నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ ప్రచురణ సంస్థ, రూ. 2,000 కోట్ల ఆస్తులు గల అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు రూ. 90 కోట్ల రుణాన్ని ఏఐసీసీ ద్వారా విడుదల చేశారని ఆయన చెప్పారు. ఆ రూ.2,000 కోట్లను దక్కించుకునేందుకే ఈ రుణం విడుదల చేశారని ఆయన చెప్పారు.