బెంగళూరు, మార్చి 7 : దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డ నటి రన్యారావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. ఈ ప్రయాణాల కారణంగా ప్రస్తుతం అలసిపోయానని, తనకు కొంత విశ్రాంతి కావాలని ఆమె కోరింది. తన తండ్రి కేఎస్ హెగ్డేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త జతీన్ హుక్కేరి ఆర్కిటెక్ట్ అని వివరించింది. తన విచారణ అంతా సక్రమంగానే సాగుతున్నదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే తాను ఈ ప్రకటన ఇస్తున్నానని తెలిపింది. స్మగ్లింగ్‌లో రన్యారావు పాత్రధారే తప్ప సూత్రధారి కాదని, ఇండో-ఆసియన్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి 4-5 లక్షలు తీసుకుంటుందని తెలిపింది. కాగా, ఈ స్మగ్లింగ్ వెనుక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.