Jammu kashmir Assembly polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య పొత్తుపై కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల పొత్తుపై బీజేపీ ఎందుకు భుజాలు తడుముకుంటున్నదని ఆయన ప్రశ్నించారు. గతంలో బీజేపీ ఏ పార్టీతో కలిసినా తాము వారు ఎందుకు కలిశారని ఎన్నడూ అడగలేదని గుర్తుచేశారు.
అలాంటిది ఇప్పుడు తమను బీజేపీ ఎందుకు ప్రశ్నిస్తున్నదని నిలదీశారు. హరియాణలోని కైథల్‌లో సుర్జీవాలా ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ గతంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలతో పొత్తు పెట్టుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. గతంలో వారు పలు పార్టీలతో అంటకాగారని, మీరు గతంలో ఇలా వ్యవహరించి ఇప్పుడు పొత్తుపై తమను బీజేపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం హామీలు గుప్పించి ఆపై వాటి అమలును విస్మరిస్తుందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు ఆ పార్టీ హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందా అని రాహుల్ గాంధీని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఓట్లు దండుకునేందుకు హామీలను ఇచ్చి ఆపై అధికారంలోకి రాగానే వాటిని విస్మరించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్ధితి లేదని అన్నారు.
Read More :
Nagarjuna Sagar | నిండు కుండలా నాగార్జునసాగర్.. గేట్ల పైనుంచి దూకుతున్న కృష్ణమ్మ.. వీడియో