నల్లగొండ: అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. అయితే అలల తాకిడికి ప్రాజెక్టు క్రస్టు గేట్లపై నుంచి కృష్ణమ్మ కిందికి దూకుతున్నది. దీంతో అన్ని గేట్లను ఎత్తారా అనేట్లుగా నీరు కిందికి వస్తున్నది.
కాగా, సాగర్ ప్రస్తుత, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టులోకి 64,699 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వెళ్తున్నది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ అంటే 312.50 టీఎంసీలు ఉన్నాయి. రెండు గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక విద్యుదుత్పత్తి, కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.