Ramdas Athawale | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడి పది రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కూటమిలోని బీజేపీకి అత్యధిక స్థానాలు రావడంతో సీఎం (Maharashtra CM) పదవి తనవద్దే ఉంచుకోవాలని చూస్తోంది. అయితే, ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అందుకు అంగీకరించడం లేదు. బీజేపీ నిర్ణయంతో ఆయన తీవ్ర కలత చెందారని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిర్ణయంతో షిండే కలత చెందారన్నది వాస్తవమేనని అన్నారు. అయినా, బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకోదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండున్నరేళ్లపాటు ఆయన సీఎంగా కొనసాగారని గుర్తు చేశారు. ప్రభుత్వం కూలిపోయిన సమయంలో.. బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ సీఎం పీఠాన్ని షిండేకు అప్పగించిందని గుర్తు చేశారు. అప్పుడు అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా కొనసాగారని చెప్పుకొచ్చారు.
కానీ, ఇప్పుడు సీఎం పదవిని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని హైకమాండ్ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే సీఎం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షిండే ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం మంచిదని సూచించారు. లేదంటే మహాయుతి కూటమి చైర్మన్‌గా.. అది కూడా నచ్చకపోతే కేంద్ర ప్రభుత్వంలో స్థానం కోరుకోవడమే తన ముందున్న దారులని అథవాలే వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కూటమిలోని బీజేపీకి 132 సీట్లు, షిండే సేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీనే ఈసారి సీఎం పదవి చేపట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) మహా తదుపరి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రటకన వెలువడాల్సి ఉంది.
మరోవైపు ఈనెల 5న సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. . అయితే, కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
Also Read..
MS Dhoni | ఉత్తరాఖండ్ సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్న ధోనీ దంపతులు.. VIDEO
Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి.. డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం..!
Om Birla | వాయిదాలు కొనసాగితే వారాంతాల్లోనూ సమావేశాలు ఉంటాయ్.. ఎంపీలను హెచ్చరించిన స్పీకర్