Parliament | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజునే సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, సభా నాయకుడు జేపీ నడ్డా గట్టిగానే సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి నిందితులను ఇంకా పట్టించుకోలేదన్నారు.
అంశంపై అన్ని పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపాయని, దాడితో పాటు ఆ తర్వాత జరిగిన ఘటనలపై సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. అదే సమయంలో చాలామంది సీనియర్ సైనిక అధికారులు సైతం అనేక విషయాలను వెల్లడించారన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సమాచారం ఇవ్వాలన్నారు.
తన మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కురిదిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 24 సార్లు చెప్పారని.. వేరే దేశానికి చెందిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశానికే అవమానకరమన్నారు. అనంతరం జేపీ నడ్డా మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ గురించి సహా ప్రతి అంశంపై చర్చించిస్తామని.. ప్రతి అంశాన్ని సభ టేబుల్‌పై ఉంచుతామన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రధానమంత్రి నాయకత్వంలో ఆపరేషన్ సిందూర్‌లో జరిగినట్లుగా ఇలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం సభలో నోటీసు ఇచ్చారని.. ప్రభుత్వం చర్చిస్తుందని.. ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.