న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.
సామాన్యులపై భారాన్ని తగ్గించడంతో పాటు ద్రవ్యోల్భణాన్ని నియంత్రించడంలో దోహదపడుతుందన్నారు. ప్రజాప్రయోజనాల కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. బుధవారం దీపావళి కానుకగా కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగా.. గురువారం అమలులోకి వచ్చాయి.
అలాగే వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు సైతం సమానంగా వ్యాట్‌ను తగ్గించాలని సూచించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, అసోం, కర్ణాటక, గోవా, త్రిపుర, ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.