న్యూఢిల్లీ : కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ (Rajnath Singh) బుధవారం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సైన్యం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి వెళ్లలేదని, మన సేనలు కావాలనుకుంటే శత్రు భూభాగంలోకి ప్రవేశించవచ్చని అన్నారు. 24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ మనకు అన్నింటికంటే దేశ గౌరవం, ప్రతిష్ట అధికమని, దేశ గౌరవాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు.
కార్గిల్ వార్ సందర్భంగా మనం నియంత్రణ రేఖ దాటి ప్రత్యర్ధి భూభాగంలోకి వెళ్లలేదని గుర్తుచేశారు. మనది శాంతి కాముక దేశం కావడంతో పాటు అంతర్జాతీయ చట్టాలను గౌరవించే ఉద్దేశంతో అలా చేశామని చెప్పారు. అయితే ఎప్పటికీ అలా చేయబోమని అనుకోరాదని, మన సరిహద్దులను కాపాడుకునే క్రమంలో అవసరమైతే నియంత్రణ రేఖ దాటతామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల్లో పాక్‌తో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరి ప్రత్యామ్నాయంగా కార్గిల్ వార్‌కు పూనుకున్నామని చెప్పారు.
పాకిస్తాన్‌ను సందర్శించడం ద్వారా కశ్మీర్ సహా అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు అప్పటి ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్‌పేయి ప్రయత్నించారని, అయితే కార్గిల్‌లో కొంత భాగాన్ని ఆక్రమించేందుకు పాకిస్తాన్ తన సైనికులను పంపిందని, పాక్ కుయుక్తులను భారత్ దీటుగా తిప్పికొట్టిందని రాజ్‌నాధ్ సింగ్ పేర్కొన్నారు. జాతి ప్రయోజనాల విషయంలో భారత సైన్యం ఎంతమాత్రం వెనక్కితగ్గదని ఆపరేషన్ విజయ్‌తో మనం పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పడంతో పాటు అంతర్జాతీయ సమాజానికి దీటైన సంకేతం పంపామని రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ గుర్తుచేశారు.
Read More :
Dating App: డేటింగ్ యాప్‌లో పరిచయమైన మహిళపై గ్యాంగ్ రేప్