Rajasthan| జైపూర్: మృతదేహంతో నిరసనలు చేపట్టడాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ బిల్లును తీసుకొచ్చింది. ఉల్లంఘించిన వారికి రెండేండ్లు జైలు శిక్ష విధించేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. ఈ బిల్లుకు గురువారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసంబద్ధ డిమాండ్ల చేస్తూ, మృతదేహాలతో నిరసనలు చేపడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు తీసుకొచ్చినట్టు రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ తెలిపారు.
మృతదేహంతో ధర్నా చేపడుతూ అధికారులపై ఒత్తిడి తెచ్చే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుత చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవని మంత్రి చెప్పారు. చనిపోయినవారి గౌరవ మర్యాదలు కాపాడటం కోసం ఈ బిల్లును తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని నిరసనల కోసం వాడుకున్నా, లేదా ఇతరులు వాడుకునేందుకు అనుమతించినా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. రెండేండ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నట్టు చెప్పారు.