జైపూర్, అక్టోబర్ 9: రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవలి వరకు కత్తులు నూరిన రెండు వర్గాలు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాము కలిసే ఉన్నామని పైకి చూపేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు.
వచ్చే నెల 23న జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోని ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరం.. పార్టీ విజయావకాశాలపై దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సంధి చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో మరోసారి రెండు వర్గాల మధ్య చిచ్చు రేగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
1993 నుంచి రాజస్థాన్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అధికారం చేతులు మారుతూ వచ్చింది. బీజేపీ సాధారణంగా ప్రయోగించే హిందూత్వ అంశం ఆ పార్టీకి కీలకంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగిపోయాయని కమలం పార్టీ విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నది.
ప్రభుత్వంపై వ్యతిరేకతకు కౌంటర్‌గా సీఎం గెహ్లాట్ పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు. ఆరోగ్య బీమా కవరేజీ, పట్టణ ఉపాధి హామీ పథకం, సామాజిక భద్రత కింద నెలకు రూ.వెయ్యి, రూ.500కు ఎల్పీజీ సిలిండర్, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ వంటివి ఇందులో ఉన్నాయి.
తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)కు జాతీయ హోదా ఇస్తామన్న హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తున్నది. కరువు ప్రాంతాలైన రాజస్థాన్ తూర్పు జిల్లాలకు తాగు, సాగు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సొంత రాష్ర్టాన్ని పట్టించుకోవడం లేదని సీఎం గెహ్లాట్ విమర్శిస్తున్నారు.