జైపూర్: విద్యాశాఖ అధికారి తన కుమారుడి కోసం ఎస్ఐ పరీక్ష పేపర్‌ను పది లక్షలకు కొనుగోలు చేశాడు. (Buying SI Exam Paper) అతడి కుమారుడు 19వ ర్యాంక్ సాధించడంతోపాటు ట్రైనీ ఎస్ఐగా ఎంపికయ్యాడు. ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై దర్యాప్తు చేసిన స్పెషల్ పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) 2021లో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) నియామక పరీక్షను నిర్వహించింది. అయితే పరీక్షకు ముందుగానే ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని ఆరోపణలు వచ్చాయి.
కాగా, రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ) దీనిపై దర్యాప్తు చేపట్టింది. ఉదయ్‌పూర్ చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీబీఈవో) బుద్ధిసాగర్ ఉపాధ్యాయ్, తన కుమారుడు ఆదిత్య ఉపాధ్యాయ్ కోసం లీకైన ప్రశ్నాపత్రాన్ని పది లక్షలకు కొన్నట్లు దర్యాప్తులో తేలింది. 19వ ర్యాంక్ సాధించిన ఆదిత్య ఎస్ఐగా ట్రైనింగ్ పొందుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిద్దరిని అరెస్ట్ చేశారు.
మరోవైపు విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయ్, టీచర్ పాండ్యా పాత పరిచయస్తులని, పేపర్ లీక్ కేసులో అరెస్టయిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు బాబులాల్ కటారాని వారు సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. ఎస్ఐ రిక్రూట్మెంట్ టెస్ట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 55 మంది ట్రైనీ ఎస్ఐలు, ఇద్దరు ఆర్పీఎస్సీ సభ్యులతో సహా వంద మందికిపైగా నిందితులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎస్ఐ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్ రాజస్థాన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
Also Read:
Job Scam | తల్లి మరణించినట్లు నమ్మించి ప్రభుత్వ ఉద్యోగాలు.. మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కామ్
Watch: ఆహారం నాణ్యతపై స్పైస్ జెట్ ప్రయాణికులు ఆగ్రహం.. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం