భోపాల్: ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగం చేయని మహిళను తన తల్లిగా ఒక వ్యక్తి నమ్మించాడు. ఆమె మరణించినట్లుగా నకిలీ సర్టిఫికేట్లు సృష్టించాడు. కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. (Job Scam) దర్యాప్తు చేయగా మరికొందరు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు పొందిన స్కామ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పరాసియా గ్రామానికి చెందిన బ్రిజేష్ కోల్, అసిస్టెంట్ టీచర్ అయిన తన తల్లి బేలా కాలీ కోల్ మరణించినట్లు నకిలీ పత్రాలు సమర్పించాడు. కారుణ్య నియామకం కింద జౌదోరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్యూన్ ఉద్యోగం పొందాడు.
కాగా, జీతం ప్రాసెసింగ్ సమయంలో పత్రాల్లో తేడా ఉండటాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ గమనించారు. దర్యాప్తు చేయగా బేలా కాలీ కోల్ ఎప్పుడూ విద్యా శాఖలో పని చేయలేదని తెలిసింది. అలాగే బ్రిజేష్‌కు ఆమెకు ఎలాంటి సంబంధం కూడా లేదని బయటపడింది. నకిలీ ధృవీకరణ పత్రాలతో కారుణ్య నియామకం కింద అతడు ప్రభుత్వ ఉద్యోగం పొందినట్లు నిర్ధారణ అయ్యింది. స్కూల్లో ప్యూన్ ఉద్యోగం పొందినప్పటికీ ఒక రోజు కూడా హాజరుకాని అతడి నియామకాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు గత ఏడాది 36 కారుణ్య నియామకాలు జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) తెలుసుకున్నారు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మరో ఐదుగురైన ఓం ప్రకాష్ కోల్, సుష్మా కోల్, వినయ్ రావత్, హిరామణి రావత్, రామ ద్వివ్ది మోసపూరితంగా నియామకాలు పొందినట్లు దర్యాప్తులో బయటపడింది. టిగ్రా, బిడా, అటారియా, సెమారియా, గంగేవ్ వంటి బ్లాకుల్లో ఈ నియామకాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. మరణ ధృవీకరణ, పోలీసు ధృవీకరణ వంటి అన్ని పత్రాలు, అఫిడవిట్లు నకిలీ అని నిర్ధారణ అయ్యింది.
కాగా, జిల్లా కలెక్టర్ పాల్ ఈ జాబ్ స్కామ్‌పై స్పందించారు. నియామకాలను ప్రాసెస్ చేసిన క్లర్క్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారి, డీఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. కారుణ్య నియామకాలను ప్రాసెస్ చేసిన క్లర్క్, ఉద్యోగాలు పొందిన ఆరుగురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 2024 డిసెంబర్ నుంచి ఏప్రిల్ 2025 మధ్య జరిగిన మోసపూరిత నియామకాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: గ్యాస్ స్టేషన్ సిబ్బందిపై గన్ గురిపెట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: జిప్‌లైన్‌పై వేలాడుతూ వెళ్తున్న బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తర్వాత ఏం జరిగిందంటే?