Honeymoon Murder : భార్యతో హనీమూన్ (Honeymoon) కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తలకు ముందు భాగంలో, వెనుక భాగంలో రెండు బలమైన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. పూర్తి పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మృతుడి భార్యే హంతకురాలని, కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీ గత నెల 11న యూపీకి చెందిన సోనమ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కొత్త జంట హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. మే 23న తూర్పు కాసీ హిల్స్ జిల్లాకు వెళ్లి కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి మేఘాలయ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించారు.
దాదాపు 11 రోజుల తర్వాత జూన్ 8న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. సోనమ్ కోసం కూడా గాలిస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. హత్యలో ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా మేఘాలయ పోలీసులు అరెస్టు చేశారు. రాజ రఘువంశీని చంపేందుకు సోనమ్ తమకు సుపారీ ఇచ్చిందని నిందితులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 20న హనీమూన్‌కు బయలుదేరిన కొత్త జంట అసోం రాజధాని గువాహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్రా (చిరాపుంజి) ని సందర్శించడానికి ఓ యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు.
మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.