Raksha Bandhan | తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ (Raksha Bandhan). ఆగస్టు 31వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు ఇప్పటి నుంచే రాఖీలు కడుతున్నారు. అంతేకాదు, ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సోదరుడికి ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన బహుమతిని (Gift To Brother) అందించేందుకు సిద్ధమైంది. ఈ రాఖీకి తన సోదరుడికి ఏకంగా జీవితాన్నే ప్రసాదించబోతోంది.
చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌కు చెందిన 48 ఏళ్ల ఓంప్రకాష్ ధంగర్ (Omprakash Dhangar) అనే వ్యక్తి గత కొంతకాలంగా దీర్ఘకాలిక కిడ్నీ (Kidney) వ్యాధితో బాధపడుతున్నాడు. అతని రెండు కిడ్నీలు డయాలసిస్ చేయాల్సిన స్థాయికి క్షీణించాయి. ఒక కిడ్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం మేర దెబ్బతిన్నాయి. దీంతో అతని కుటుంబ సభ్యులు ఓం ప్రకాష్‌కు కిడ్నీ శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. అయితే, కిడ్నీ దాత కావాలని వైద్యులు చెప్పడంతో.. రాయ్‌పూర్ (Raipur)లోని తిక్రపారాలో (Tikrapara) నివాసం ఉండే ఓంప్రకాష్ సోదరి షీలాబాయి పాల్ (Sheelabai Pal) వెంటనే కిడ్నీ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఈ రాఖీకి తన సోదరుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించుకుంది.
దీంతో వైద్యులు షీలాబాయికి శస్త్రచికిత్సకు అవసరమైన అన్ని టెస్టులు చేయగా.. ఆమె కిడ్నీ సోదరుడికి మ్యాచ్ అవుతుందని వెల్లడైంది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా వెంటనే శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. వచ్చే నెల (సెప్టెంబర్) 3వ తేదీన గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కిడ్నీ మార్పిడికి వారం ముందు షీలాబాయి తన సోదరుడు ఓం ప్రకాష్‌కు రాఖీ కట్టింది. తన సోదరుడు ఆయురారోగ్యాలతో జీవించాలనే కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపింది. రాఖీకి ఇంతకంటే మంచి బహుమతి ఏమి ఇవ్వగలను అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
Also Read..
Praggnanandhaa | ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన ప్రజ్ఞానంద.. ఎందుకంటే..?
Cabin Crew | విమానం రెక్కలపై నిల్చుని ఫొటోలకు ఫోజులిచ్చిన సిబ్బంది.. వీడియో
Putin | అరెస్ట్ వారెంట్ తర్వాత.. తొలిసారి దేశ సరిహద్దులు దాటనున్న పుతిన్