చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై (Chennai) జలమయమయింది. చెన్నైలోని కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు వార్డుల్లోకి వర్షపు నీరు చేరడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్ మహేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో ఔట్ పేషెంట్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొవిడ్ వార్డులతో పాటు ఇతర వార్డుల్లో ఉన్న రోగులకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు.
చెన్నపట్నంలో గత 17 గంటలకుపైగా విడవకుండా వాన పడుతున్నది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా చెన్నై చోళవరంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం (rainfall) నమోదయింది. గుమ్మడిపూండిలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్లో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఏ క్షణమైన గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కాగా, చెన్నై తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం మహాబలిపురం వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సూచించారు. దీంతో మహాబలిపురంలోని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. పర్యాటకులను అనుమతించేదిలేదని స్పష్టం చేసింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై, నాగపట్నం, పుదుచ్చేరి కరైకాల్తోపాటు ఏడు ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
#WATCH Rainwater enters ESI Hospital located in Chennai's KK Nagar
— ANI (@ANI) November 11, 2021
All facilities including OPDs are operational here with the available manpower. The hospital wards including COVID19 wards are not affected, says Dr Mahesh of ESI hospital pic.twitter.com/WsWPtgG3Bc