Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు వెళ్లే భక్తులకు నార్తర్న్ రైల్వేస్ (Northern Railways) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ట్రాఫిక్, ఇతర సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వందే భారత్ రైలు (Vande Bharat)ను నడపనుంది. ఈ రైలు నేటి నుంచి అంటే ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ మీదుగా వారణాసి వరకూ వెళ్లనుంది.
వందే భారత్ ప్రత్యేక రైలు (02252) న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 5:30 గంటలకు బయల్దేరుతుంది. 12 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఇక 2:20కి వారణాసి చేరుకుంటుంది అని నార్తర్న్ రైల్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుగు ప్రయాణంలో 02251 నంబర్ గల స్పెషల్ వందే భారత్ రైలు వారణాసిలో 3:15కి బయల్దేరుతుందని పేర్కొంది. ఈ రైలు ప్రయాగ్‌రాజ్‌కు 17:20 (సాయంత్రం 5:20కి) చేరుకుంటుంది. ఇక రాత్రి 11:50కి అంతా ఢిల్లీ స్టేషన్‌కు చేరుకుంటుందని నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ తెలిపారు. వారాంతంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రైల్వే స్టేషన్లు యాత్రికులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది రోడ్డు మార్గంలో వెళ్తుండటంతో ప్రయాగ్‌రాజ్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గత వారాంతం దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సెమీ హైస్పీడ్ రైలు భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిచనుంది.
మరోవైపు గత నెల 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేలా.. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26తో ముగియనుంది. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (ఫిబ్రవరి 14) దాదాపు 50 కోట్ల మంది నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు వెల్లడించారు.
Also Read..
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు
Deportation: అమెరికాకు సమీపంలో అమృత్సర్.. పంజాబ్ సీఎంకు బీజేపీ కౌంటర్
Sammelanam OTT | ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ‘సమ్మేళనం’ ట్రైలర్ రిలీజ్