Indian Railways | ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే ఫెస్టివల్ రష్ (Festival Rush)ను దృష్టిలో పెట్టుకొని ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించింది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్ (Round Trip Package) కింద రిటర్న్ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ప్రవేశపెట్టింది. పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, సౌకర్యాలను పెంచడానికి ప్రయోగాత్మకంగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ శనివారం ప్రకటించింది.
పండగల సీజన్ షురూ అయ్యింది. వినాయక చవితి, దీపావళి, దసరా తదితర పండగలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక పనినిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సొంతూళ్లకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ప్రిఫర్ చేస్తారు. దీంతో పండగల సీజన్లో రైళ్లు రద్దీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించే ఉద్దేశంతో భారతీయ రైల్వే (Indian Railways) రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్‌తో ప్రయాణికుల ముందుకు వచ్చింది.
రైల్వే మంత్రిత్వశాఖ (Ministry of Railways) అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ఆగస్టు 14వ తేదీ నుంచి రౌండ్ ట్రిప్ ప్యాకేజ్ స్కీమ్ అమల్లోకి రానుంది. అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ మధ్య స్వస్థలాలకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్యలో తిరుగు ప్రయాణానికి టికెట్ తీసుకోవాలి. ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే బుకింగ్ వెబ్‌సైట్‌లోని ‘కనెక్టింగ్ జర్నీ’ ఫీచర్ ద్వారా ప్రయాణికులు ఈ స్కీమ్‌ను ఉపయోగించకోవచ్చు. అయితే, వెళ్లడానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం ఒకేలా ఉండాలి. రెండు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఈ పథకం కింద రిటర్న్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సాధారణంగా ఉండే 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ కాలపరిమితి (ఏఆర్పీ) వర్తించదని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. 20% రాయితీ తిరుగు ప్రయాణం (Return Journey Tickets) ప్రాథమిక ఛార్జీపై మాత్రమే ఉంటుంది. రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు కూడా ఉండదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. ఇక ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లకు, అన్ని క్లాసులు, ప్రత్యేక రైళ్లకు ఈ పథకం వర్తిస్తుంది.
Also Read..
Bishnoi Gang | సల్మాన్‌తో కలిసి ఎవరైనా పనిచేస్తే.. వారిని చంపేస్తాం : బిష్ణోయ్ గ్యాంగ్
Raksha Bandhan 2025 | చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్