లండన్ : ఇండియా వర్సెస్ భారత్ (India vs Bharat) రగడపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారతదేశ ఆత్మపై దాడి చేస్తున్నవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాషాయ పాలకులను హెచ్చరించారు. దేశం పేరును మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారు మౌలికంగా చరిత్రను నిరాకరిస్తున్నారని అన్నారు. వారు చేస్తున్న దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందని రాహుల గాంధీ హెచ్చరించారు. భారత్ ఆత్మపై దాడి చేసేందుకు ప్రయత్నించేవారు తమ చర్యలకు మూల్యం చెల్లించకతప్పదని ప్యారిస్‌లోని సైన్సెస్ పీఓ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
దేశాన్ని ఇండియా లేదా భారత్ అనే పేర్లతో పిలవడం ఆమోదయోగ్యమే అయినా పేరు మార్పు వెనుక ఉద్దేశాలే కీలకమని చెప్పారు. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే కేంద్ర ప్రభుత్వం దేశం పేరును భారత్‌గా మార్చేందుకు పూనుకుందని ఆరోపించారు. భారత రాజ్యాంగంలో ఇండియా, భారత్ రెండు పదాలు ఉన్నాయని, రెండు పదాలు సరైనవేనని అన్నారు.
అయితే తమ కూటమి పేరుతో కేంద్ర ప్రభుత్వం అసహనానికి లోనవుతోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. తమ కూటమి పేరు ఇండియా కావడంతో కాషాయ పాలకులు దేశం పేరును మార్చాలని నిర్ణయించారని అన్నారు. దేశంలో మైనారిటీలను బీజేపీ, ఆరెస్సెస్‌లు అణిచివేస్తున్నాయని ఆరోపించారు. మైనారిటీలను బీజేపీ అణగదొక్కడాన్ని తాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. మైనారిటీలు తమ స్వదేశంలోనే అభ్రదతాభావంతో బతకడం దేశానికి సిగ్గుచేటని అన్నారు.
Read More :
Jaisalmer | జైసల్మేర్‌లో ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు.. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు