Rahul Gandhi : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతంగా మారనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రతిపక్ష ఎంపీలతో కలిసి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతానని చెప్పారు. ఇండియా బ్లాక్ ఎంపీలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో బుధవారం ప్రతిపక్ష ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం తాము ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు అధికారులను కలవాలని ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే, ఇందుకు అనుమతి కోరినప్పటికీ తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. తమ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని, చివరకు నిరసన తెలిపేందుకు కూడా అనుమతివ్వలేదని ఆరోపించారు. అందువల్ల జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగుతున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అని, ఆయనను చట్టబద్ధమైన ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా గుర్తించడం లేదన్నారు.
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి దేశ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేశారని రాహుల్ ఆరోపించారు. వాళ్లంతా దేశానికి కుట్రదారులే అన్నారు. వారిపై తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జ్ఞానేష్ కుమార్ తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ ఆందోళనల సందర్భంగా తనపై నమోదయ్యే ప్రతి ఎఫ్ఐఆర్ను ఒక మెడల్‌గా భావిస్తానని రాహుల్ అన్నారు. తనపై ఇప్పటివరకు 45 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 100 ఎఫ్ఐఆర్లు తన టార్గెట్ అంటూ వివరించారు. రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రతిపక్షాల పోరాటం కొనసాగుతుందని ఖర్గే స్పష్టం చేశారు.