Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. ఓ కేసు విచారణకు పదేపదే గైర్హాజరు అవుతుండటంతో పనిష్మెంట్ కింద కోర్టు ఈ జరిమానా వేసింది. జరిమానా డబ్బును ఫిర్యాదుదారు నరేంద్రపాండే తరఫు న్యాయవాదికి అందజేయాలని లక్నో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌గాంధీ తరఫు న్యాయవాదికి సూచించింది.
2022లో మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గురించి రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటిషర్లకు సేవకుడని, బ్రిటిషర్ల నుంచి ఆయన పెన్షన్ కూడా తీసుకున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో రాహుల్‌గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీకి చెందిన నరేంద్రపాండే అనే వ్యక్తి లక్నో కోర్టులో పిటిషన్ వేశారు.
కానీ ఈ కేసు విచారణకు రాహుల్‌గాంధీ ఎన్నడూ హాజరుకాలేదు. దాంతో కోర్టు తాజాగా రూ.200 జరిమానా విధించింది. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. లోక్‌సభ సమావేశాలతో బిజీగా ఉన్నందున ఆయన విచారణకు హాజరుకాలేరని పేర్కొన్నారు. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు. తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా విచారణకు హాజరుకాకుంటే రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.