Rahul Gandhi : ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అలక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నాగాలాండ్‌లో మౌలిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ నాగాలాండ్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
నాగాలాండ్ ప్రజలు రోజూ తిరిగే ఈ గతుకుల రోడ్లపై మీరు నడిచే సాహసం చేస్తారా అని మోదీని ఆయన నిలదీశారు. ఇది నాగాలాండ్ ప్రజలను మోసం చేయడమేనని, ఈ గుంతల రోడ్లతో నాగాలాండ్ యువతకు మీరు మెరుగైన భవిష్యత్‌ను ఎలా తీసుకురాగలరని ప్రశ్నించారు.
నాగా ప్రజలు రహదారులు సవ్యంగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ సమస్యలు, మౌలిక వసతుల లేమి ఈ ప్రాంతాన్ని వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాగా ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు లభించడం లేదని అన్నారు. అభివృద్ధిలో నాగాలాండ్, మణిపూర్, అసోం సహా ఈశాన్య ప్రాంత ప్రజలు భాగస్వామ్యం కాలేకపోతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Clothes for Lord Ram | అయోధ్య రామయ్య కోసం 12 లక్షల మంది నేసిన ప్రత్యేక వస్త్రాలివే.. Video