Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవలే కుంభవృష్టితో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు. తన ఒక నెల జీతం రూ.2.3 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని అందజేశారు.
“వయనాడ్‌లోని మా సోదర, సోదరీమణులు వినాశకరమైన విషాదాన్ని చవిచూశారు. వారు ఎదుర్కొన్న ఈ నష్టాల నుంచి కోలుకునేందుకు మన మద్దతు అవసరం. అందుకే బాధితుల సహాయార్థం, పునరావాస ప్రయత్నాలకు నా వంతు సాయంగా నెల మొత్తం జీతాన్ని విరాళంగా ఇచ్చాను’ అని రాహుల్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, ప్రకృతి విపత్తులో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ‘స్టాండ్ విత్ వయనాడ్ – ఐఎన్‌సీ’ అనే యాప్‌ను రూపొందించింది. వయనాడ్‌లో పునరావాస పనులకు సంబంధించిన పురోగతిని కాంగ్రెస్ ఎంపీ కే సుధాకరన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం లిజు తెలిపారు.
కాగా, జూలై నెల చివర్లో భారీ వర్షాలు వయనాడ్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు మెరుపు వరదలు సంభవించాయి. దీంతో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విలయంలో సుమారు 400 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. రోడ్లు, కమ్మూనికేషన్ వ్యవస్థ అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించేందుకు కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కేరళ సర్కార్‌కు పలువురు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇక వయనాడ్‌లో బాధితులకు కాంగ్రెస్ పార్టీ కూడా 100 ఇళ్లు నిర్మించాలని తలపెట్టింది. ఇందుకోసం పార్టీ విరాళాలు సేకరిస్తోంది. దీనికి రాహుల్ కూడా తన వంతు సాయం అందించారు.
Also Read..
PM Modi | సింగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం.. ఢోలు వాయించిన ప్రధాని.. వీడియో
Bihar | నృత్య ప్రదర్శనను తిలకిస్తుండగా కూలిన పైకప్పు.. వందలాది మందికి గాయాలు.. షాకింగ్ వీడియో