న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్ధానాలను గెలుస్తుందనే భయంతో దిక్కుతోచని పరిస్ధితుల్లో కాషాయ పాలకులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నారని ఆప్ ఆరోపించింది. బీజేపీ ఏజెన్సీలు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తాయని, లిక్కర్ స్కామ్‌లో అందుకే ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిందని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) అన్నారు. అరెస్ట్ చేసే విపక్ష జాబితాలో తొలి పేరు కేజ్రీవాల్దేనని చెప్పారు.
కేజ్రీవాల్‌ను జైల్లో వేసి ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్నది బీజేపీ ఆలోచన అని రాఘవ్ చద్దా ఆరోపించారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీ టార్గెట్ జార్ఖండ్ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ అని పేర్కొన్నారు. హేమంత్ సోరెన్ సీఎం అయిన తర్వాత జార్ఖండ్‌లో ఆయన ప్రతిష్ట మరింత ఇనుమడించిందని అన్నారు.
2019లో జార్ఖండ్‌లోని 19 స్ధానాల్లో 14 స్ధానాలను గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో 4 సీట్లు కూడా గెలిచే పరిస్ధితి లేదని పేర్కొన్నారు. అలాగే బిహార్‌లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ బీజేపీ లక్ష్యమని చెప్పారు. బీజేపీ ప్రేరేపిత ఏజెన్సీలు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనీ టార్గెట్ చేస్తాయని అన్నారు. దీదీని ఓడించలేమని గుర్తించిన బీజేపీ నేతలు మమతా బెనర్జీని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీలను అరెస్ట్ చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారని రాఘవ్ చద్దా ఆరోపించారు.
Read More :