కైరో: పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా దాడులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో విదేశీయులు తొలిసారి గాజాను వీడారు. బుధవారం రాఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్ట్‌లోకి ప్రవేశించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Gaza War) ప్రారంభమైన తర్వాత తొలిసారి అనేక మంది విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్లు బుధవారం గాజాను వీడటం మొదలుపెట్టారు. గాజా దక్షిణ సరిహద్దులో ఉన్న రాఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌లోకి వెళ్లారు. 44 దేశాలకు చెందిన పాస్‌పోర్ట్ హోల్డర్లు, ఐక్యరాజ్యసమితి (ఐరాస)తో సహా 28 విదేశీ ఏజెన్సీలకు చెందిన సిబ్బంది ఈజిప్ట్‌లోకి ప్రవేశించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. సుమారు 400 మంది విదేశీయులు, వాహనాలతోపాటు పలు అంబులెన్స్‌లు ఈజిప్ట్‌లోకి వెళ్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.
మరోవైపు తీవ్రంగా గాయపడిన 81 మంది పాలస్తీన్లను చికిత్స కోసం ఈజిప్ట్‌లోకి అనుమతించినట్లు ఆ దేశం బుధవారం ప్రకటించింది. గాజాలో అతిపెద్దదైన జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడిలో 50 మందికిపైగా మరణించడాన్ని ఖండించింది. రక్షణలేని పౌరులను లక్ష్యంగా చేసుకునే విచక్షణ రహిత దాడుల కొనసాగింపు తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఈజిప్ట్ హెచ్చరించింది.