Ragging | ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ అగెనిస్ట్ వాయిలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (SAVE) ఈ నివేదికను పబ్లిష్ చేసింది. 1,946 కాలేజీల నుంచి జాతీయ యాంటీ – ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు అందిన 3,156 ఫిర్యాదులను విశ్లేషించి నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. వైద్య కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వాటిని ర్యాగింగ్‌కు ‘హాట్‌స్పాట్స్’గా గుర్తించారు. ర్యాగింగ్ సంబంధిత కేసుల్లో 51 మంది విద్యార్థులు మరణించారు. అనేక సందర్భాల్లో ర్యాగింగ్ చాలా తీవ్రంగా ఉందని, మానసిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కూడా నివేదిక పేర్కొంది.
ఉన్నత విద్యా సంస్థలలో ర్యాగింగ్ భూతంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా లోతైన అధ్యయనం నిర్వహించింది. 2022-24లో మొత్తం ఫిర్యాదుల్లో 38.6 శాతం, తీవ్రమైన ఫిర్యాదుల్లో 35.4 శాతం, ర్యాగింగ్ సంబంధిత మరణాలలో 45.1 శాతం వైద్య కళాశాలలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది. ర్యాగింగ్ కారణంగా 51 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది కోటాలో నివేదించబడిన 57 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దాదాపు సమానమని డేటా పేర్కొంది. సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధించిన కేసులు వైద్య కళాశాలల్లో ఎక్కువగా కనిపించాయని నివేదిక పేర్కొంది. దాంతో విద్యార్థులు ఓ వైపు చదువు ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. దీనికి ర్యాగింగ్ భూతం జతకావడంతో మరింత తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వ, విద్యా సంస్థలు అనేక నిబంధనలు తీసుకువచ్చినా.. ర్యాగింగ్ కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. జాతీయ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ లక్ష్యం అలాంటి కేసులపై తక్షణ చర్య తీసుకోవడం. కానీ, చాలా సందర్భాల్లో బాధిత విద్యార్థులు ఒత్తిడి కారణంగా విషయం బయటకు చెప్పేందుకు భయపడుతున్నట్లుగా నివేదిక తెలిపింది. విద్యా సంస్థల్లో తీవ్రమైన ర్యాగింగ్ ఘటనలు జరుగుతున్నా.. చాలా తక్కువ మంది మాత్రమే ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ తర్వాత భయపడి మౌనంగా ఉంటున్నారని నివేదిక పేర్కొంది. అయితే, ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు హాస్టల్స్‌లోనూ సీసీటీవీ నిఘాను, సిబ్బందిని మోహరించాలని.. యాంటీ-ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు పర్యవేక్షించాలని నివేదిక పేర్కొంది.
అంతేకాకుండా.. యూజీసీ, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కొత్త విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లలో వసతి కల్పించాలి. తీవ్రమైన ర్యాగింగ్ కేసులకు సంస్థలు 24 గంటల్లోపు పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఎవరైనా ర్యాగింగ్‌కు బాధితులుగా మారితే తక్షణమే నేషనల్ జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌కు వెంటనే ఫిర్యాదు చేయాలని.. కళాశాల పరిపాలన, సంబంధిత అధికారులకు సైతం తెలుపాలని.. అవసరమైన చట్టపరమైన సహాయం తీసుకోవాలని నివేదిక సూచించింది. విద్యార్థులు హక్కుల గురించి తెలుసుకోవాలని.. స్నేహితులు, కుటుంబ సభ్యులు మాట్లాడాలని.. ఒంటరిగా ఉంటూ మానసిక ఒత్తిడి భరించకూడదని చెప్పింది.