చండీగఢ్: సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు సోమవారం పంజాబ్ బంద్ జరిగింది. అధికారులు 200కుపైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. రైల్వే స్టేషన్లలో సరైన సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు, ప్రయాణికుల రవాణా వాహనాల సేవలు కూడా రద్దయ్యాయి. దీంతో రాష్ట్రమంతా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం ఉదయం నుంచి పాటియాలా-చండీగఢ్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద ధర్నాకు దిగారు. పాటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, బటిండా, పఠాన్కోట్లలోని రోడ్లు, జాతీయ రహదారులపై ధర్నాలు చేశారు. అమృత్సర్ గోల్డెన్ గేట్ వద్ద, బటిండాలోని రాంపూర్ ప్రవేశ మార్గం వద్ద రైతులు భారీగా నిరసన చేపట్టారు.
బంద్ కారణంగా వాహనాలు రోడ్లపై పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఫిరోజ్పూర్, జలంధర్, లూధియానా, బటిండా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు చిక్కుకున్నారు. హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతం ప్రజలపై రైళ్లు, బస్సుల రద్దు ప్రభావం తీవ్రంగా పడింది. విమానాశ్రయాలు, దవాఖానలు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి ఆటంకం కలిగించబోమని రైతులు చెప్పారు.
ఆమరణ దీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన రైతు సంఘం నేత డల్లేవాల్కు చికిత్స చేయించేందుకు పంజాబ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీంకోర్టు నేడు (మంగళవారం) సమీక్షిస్తుంది.