అల్మోరా, అక్టోబర్ 7 : ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఎంపీసీఎల్) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన తీవ్రమైంది. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో గల ఆ కంపెనీ ఎదుట వందలాది మంది ఉద్యోగులు కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లాభాల్లో ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమతో సంప్రదించకుండా, తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తూ అమ్మేస్తున్నదని ఉద్యోగులు ఆరోపించారు. ‘మా నిరసన ఓ కంపెనీని అమ్మడం గురించి కాదు. భారత ఆయుర్వేద పరిశ్రమ భవిష్యత్తును అమ్మడం గురించి’ అని ఓ నిరసనకారుడు తెలిపారు. 500 మందికి పైగా ఉద్యోగులు, ఔషధాల తయారీకి ముడి సరుకులు సరఫరా చేసే వేలాది మంది సన్నకారు రైతులు ఈ కంపెనీపై ఆధారపడ్డారని.. ఇలాంటి విలువైన కంపెనీని ఎంపిక చేసిన స్నేహితులకు ఎందుకు కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ అధీనంలో ఆయుర్వేద, యునానీ మందులను ఉత్పత్తి చేస్తూ భారత సంప్రదాయ వైద్య విధానాన్ని ప్రచారం చేస్తున్న ఐఎంపీసీఎల్ ఏటా స్థిరంగా లాభాలు పొందుతున్నది.