న్యూఢిల్లీ, జూలై 13: ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభవం కానున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్‌కు వివిధ వర్గాల నుంచి నిరసన సెగ ఎదురవుతున్నది. దేశ రాజధానిలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ మరోసారి రణక్షేత్రంగా మారడానికి సిద్ధమవుతోంది. గడచిన మూడు వారాలుగా క్రాకోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన నిరసనలను జంతర్ మంతర్ వద్ద కొనసాగిస్తుండగా విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, మరి కొందరు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. జమ్మూ కశ్మీరులోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్, మహిళల జాతీయ కూటమి కూడా జంతర్ మంతర్‌కు బయల్దేరుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు అక్కడే నిరసన కొనసాగిస్తామని మహిళల కూటమి స్పష్టం చేస్తోంది.
కేద్ర పాలిత ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో తాము చేపట్టనున్న చేపట్టనున్న ఆందోళనలో పాల్గొనాలని విపక్ష పార్టీలన్నిటినీ జమ్ము కశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆహ్వానించడంతో ఢిల్లీలో జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర హోదా డిమాండు మార్మోగనున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తృతంగా బహిరంగ సభలను నిర్వహిస్తూ రాష్ట్ర హోదా డిమాండును ఒమర్ అబ్దుల్లా ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతున్నారు.
కేంద్ర ప్రభుత్వంపైన తన ఆరోపణాస్ర్తాలను ఎక్కుపెట్టిన అబ్దుల్లా రాష్ట్ర హోదా అంశాన్ని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంప్రదిస్తారేమో అని ఎద్దేవా చేశారు. బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ నిర్ణయాలను ట్రంప్ ప్రకటిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. తమ ఐక్యతను చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలలో అధికం ఈ ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), జనగణన(సెన్సస్) నుంచి వేరుచేసి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలలో 33 శాతం మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండు చేసేందుకు జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు జంతర్ మంతర్ వద్ద నిరసనలో కూర్చోనున్నట్లు జాతీయ మహిళా సంఘాల కూటమి కూడా ప్రకటించింది. ఇందుకు సమాంతరంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శనలు జరుగుతాయని కూటమి నిర్వాహకులు తెలిపారు.
డీలిమిటేషన్, లోక్‌సభ స్థానాల పెంపు వంటి తన రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా వాడుకుంటోందని వారు వాదిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థులు, యువజనులు ఆమరణ దీక్ష వద్దనే తాము కూడా నిరసన సాగిస్తామని వారు చెప్పారు. జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చింది.