న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా శనివారం దేశ రాజధానిలో భారీ నిరసన జరగనున్నది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ20కి వ్యతిరేకంగా తన జాతీయ ప్రచారాన్ని ప్రారంభించనుండగా హక్కుల కార్యకర్త తెహసీన్ పూనావాలా మౌన ప్రదర్శన, నిరాహార దీక్షతో తన ఆందోళనను ఉధృతం చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఈ20(20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) కార్యక్రమానికి వ్యతిరేకంగా తన జాతీయ స్థాయి ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు ఒక ప్రముఖ వ్యక్తి ఈ పోరాటంలో చేరబోతున్నారని కేజ్రీవాల్ ప్రజలకు సూచనప్రాయంగా తెలిపారు. ఇథనాల్ మిశ్రమం అంశంపై జూలై 5న జరిగిన తొలి ప్రత్యక్ష నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించిన పూనావాలా గాంధీ స్మృతి వరకు పాదయాత్ర చేసి నిరాహార దీక్షను ప్రారంభిస్తానని ప్రకటించిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ20కి వ్యతిరేకంగా రేపు(ఆగస్టు 1) జరగనున్న సమావేశంలో ప్రజల సమస్యలను వినడానికి, ఈ20పై ఒక నిర్ణయం తీసుకోవడానికి దేశంలోని ఒక ప్రముఖ వ్యక్తి నాతోపాటు పాల్గొంటారు. మీ అభిప్రాయాలను పంచుకోవడానికి మీరు కూడా తప్పక రండి అని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వర్చువల్ విధానంలో పాల్గొనదలచిన వారి కోసం ఆయన ఒక వాట్సాప్ నంబర్‌ను కూడా విడుదల చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సహా తమ మూడు ప్రధాన డిమాండ్లు నెరవేరడంతో సీజేపీ నిరసన ముగిసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ఇప్పుడు కొత్త వివాదాస్పద అంశంగా మారింది. ఈ20కి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించడంతో కేంద్రం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ తదుపరి ప్రధాన రాజకీయ వివాదాంశంగా వేగంగా రూపుదిద్దుకుంటున్నది.