IndiGo Flight : మహారాష్ట్ర (Maharastra) లోని పుణె సిటీ (Pune city) నుంచి హైదరాబాద్ (Hyderabad) కు వస్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఓ పక్షి బలంగా ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యంత చాకచక్యంగా ఆ విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దాంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇండిగోకు చెందిన ‘6ఈ352’ విమానం పుణె నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మార్గమధ్యలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దాంతో పైలట్ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించారు. ల్యాండింగ్ అనంతరం నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తించారు. పక్షి ఢీకొనడంవల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంవల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా చండీగఢ్ వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.