చెన్నై: నిషేధిత తమిళ ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) పునరుద్ధరణకు శ్రీలంక మహిళ (Lankan Woman) ప్రయత్నించింది. నకిలీ పాస్‌పోర్ట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ప్రశ్నించనున్నది. శ్రీలంక జాతీయురాలైన లెచ్చుమనన్ మేరీ ఫ్రాన్సిస్కా 2019 డిసెంబర్లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. అయితే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా చెన్నైలో ఉండటంతో పాటు నకిలీ పత్రాల ద్వారా భారత్ పాస్‌పోర్ట్ పొందింది. ఈ నేపథ్యంలో 2021 అక్టోబర్‌లో చెన్నై విమానాశ్రయంలో మేరీ ఫ్రాన్సిస్కాను తమిళనాడు సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. భారత్‌లో అక్రమంగా నివసించడం, నకిలీ పాస్‌పోర్ట్ పొందడం వంటి నేరాలపై ఆమెపై కేసు నమోదు చేశారు.
కాగా, నిషేధిత ఎల్టీటీఈ పునరుద్ధరణ, ఆ సంస్థ కార్యకలాపాలకు వనరులను సమీకరించడానికి మేరీ ఫ్రాన్సిస్కా కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాలను యాక్సెస్ చేయడం, ఎల్టీటీఈ క్యాడర్ల పునఃసమూహానికి సహాయపడేందుకు నిధులు మళ్లించేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఆమె వాంగ్మూలాల ఆధారంగా టీ కెన్నిస్టన్ ఫెర్నాండో, కే బాస్కరన్ సహా మరో ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ కేనును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. డెన్మార్క్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళుడు, మాజీ ఎల్టీటీఈ కార్యకర్త ఉమాకాంతన్తో శ్రీలంక మహిళకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఉమాకాంతన్ సూచనల మేరకు పనిచేస్తున్న ఫ్రాన్సిస్కా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని నిష్క్రియాత్మక ఖాతా నుంచి రూ.42 కోట్లకు పైగా మళ్లించేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కుట్రలో భాగంగా సహచరులకు విదేశీ చెల్లింపులు ఆమె జరిపినట్లు దర్యాప్తులో గుర్తించారు.
కాగా, 2021 అక్టోబర్‌లో అరెస్ట్ అయినప్పటి నుంచి పుళల్ సెంట్రల్ జైలులో మేరీ ఫ్రాన్సిస్కా ఉన్నది. ఎల్టీటీఈ పునరుద్ధరణ కోసం మనీలాండరింగ్‌కు ఆమె పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. దీంతో జైలు ఆవరణలో రెండు రోజుల పాటు ఆమెను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతిని ఈడీ కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు ‘విచిత్రమైన కేసు’గా అభివర్ణించింది. ఫ్రాన్సిస్కా విచారణ కోసం ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, ఇతర అవసరమైన పరికరాలను ఈడీ అధికారులు జైలులోకి తీసుకెళ్లడానికి కోర్టు అనుమతించింది.
Also Read:
Unnatural Act With Cow | ఆవు పట్ల అసహజ ప్రవర్తన.. వ్యక్తి మెడలో చెప్పుల దండ వేసి ఉరేగింపు