Loksabha Elections 2024 : మోదీ పదేండ్ల పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశంలో దాదాపు 70 కోట్ల మంది నిరుద్యోగులున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక మంగళవారం అమేథిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. గొప్పగా హామీలు గుప్పించి ఆపై ఒక్క హామీనీ నెరవేర్చకపోవడమే కాషాయ పార్టీ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
యువతకు ఉద్యోగాలు, రైతుల రాబడి పెంపు, నల్లధనాన్ని వెనక్కితీసుకొస్తామని మోదీ ఊదరగొట్టి ఉసూరుమనిపించారని అన్నారు. మోదీ హామీలను గాలికొదిలేశారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. మరోవైపు యూపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. ప్రధాని ఏమైనా జ్యోతిష్యులా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. తాము లోక్‌సభ ఎన్నికల్లో 400 స్ధానాలకు పైగా సాధించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదని, యూపీలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని ప్రధాని మోదీ అంతకుముందు వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ఓ వార్తా సంస్ధతో మాట్లాడుతూ ఏ పార్టీ ఏం చేసిందనేది ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తామేం చేశామో కాషాయ పాలకులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆపై కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనేది అర్ధం చేసుకోవాలని అన్నారు. ఈ విషయాలను ప్రజలు బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలకు ప్రియాంక గాంధీ పిలుపు ఇచ్చారు.
Read More :
Flight Journey | 110 రోజులు.. 200 విమానాల్లో ప్రయాణం.. ఎందుకంటే..?