Priyanka Gandhi | నిన్న మొన్నటి వరకూ పార్టీ ప్రచారానికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను ప్రకటించారు.
తనకు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రియాంక వెల్లడించారు. అందులో రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు కాగా, స్థిరాస్తులు రూ.7.74 కోట్లుగా ప్రకటించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన భర్త వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారుతో పాటు రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారు నగలు ఉన్నాయని తెలిపారు.
న్యూ ఢిల్లీలోని మోహ్రౌలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్ భవనంలో సగం వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తన పేరిట ఓ నివాస భవనం (Shimla house) ఉందని.. ప్రస్తుతం దాని విలువ రూ.5.63 కోట్లు అని తెలిపారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన మొత్తం ఆదాయం రూ.46.39 లక్షలు తెలిపారు. అద్దెలతో పాటు బ్యాంకులు, ఇతర పెట్టుబడులపై వడ్డీ రూపంలో ఈ ఆదాయాన్ని పొందానని ఆమె వివరించారు. తనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ప్రియాంక తెలిపారు. ఇక తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల నికర విలువ సుమారుగా రూ.65.54 కోట్లు అని ప్రియాంక గాంధీ వెల్లడించారు. అందులో రూ.37.9 కోట్లకు పైగా చరాస్తులు కాగా, రూ. 27.64 కోట్లకు పైగా స్థిరాస్తులు అని పేర్కొన్నారు.
ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ సోదరుడైన రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. రాయ్‌బరేలీ, వయనాడ్ స్థానాల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాయ్‌బరేలీని అట్టే పెట్టుకుని వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో సోదరుడి రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి హస్తం పార్టీ ప్రియాంక గాంధీని బరిలోకి దింపింది. ఇక ఈ స్థానానికి ఉప ఎన్నికను (by-election) కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ 13న నిర్వహించనుంది.
Also Read..
Bomb Threats | ఎయిర్ ఇండియా, ఇండిగో సహా.. 80కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
Bengaluru | ట్రాఫిక్ జామ్.. వాహనాలను వదిలి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిన ప్రయాణికులు.. VIDEO
Cyclone Dana | తీవ్ర తుఫాన్‌గా దానా.. ఒడిశాలోని ఆ రెండు ఆలయాలు మూసివేత