Priyanka Gandhi | లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీ ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదం ఫలించలేదు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం 292 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా 234 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ (Emotional Post) పెట్టారు.
‘వారు (బీజేపీని ఉద్దేశిస్తూ) నిన్ను ఎంతగానో అమవానించినా, అవహేళన చేసినా.. ఏం చేసినా సరే దృఢంగా నిలబడ్డావ్. అవరోధాలు ఎదురైనప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అవమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. నీపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదు. ప్రతి రోజూ నీపై కోపం, ద్వేషం పంచినా దాన్ని నీ దరి చేరనీలేదు. ప్రేమ, దయతో నిజం కోసం పోరాడావు. ఇది వాళ్లందరికీ ఇప్పుడు అర్థం అవుతుంది. నువ్వు మాలో అందరికంటే ధైర్యవంతుడివని మాకు తెలుసు. నీకు సోదరిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ట్వీట్ ఆకట్టుకుంటోంది.
You kept standing, no matter what they said and did to you…you never backed down whatever the odds, never stopped believing however much they doubted your conviction, you never stopped fighting for the truth despite the overwhelming propaganda of lies they spread, and you never… pic.twitter.com/t8mnyjWnCh
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 5, 2024
కాగా, ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించింది. ముఖ్యంగా ప్రియాంక, రాహుల్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించి బీజేపీ ఆశలకు గండి కొట్టారు. ‘భారత్ జోడో యాత్ర’ తో రాహుల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా.. ప్రియాంక తన ప్రసంగాలతో ఆకర్షించారు. భావోద్వేగ ప్రసంగాలతో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి ప్రచారానికి తోడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యూహాలు కూడా ఫలించాయి. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీగా పుంజుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయేకి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది.
గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే 47 సీట్లు ఎక్కువ సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అమేథి, రాయ్‌బరేలీలో సైతం భారీ మెజారిటీతో విజయకేతం ఎగురవేశారు. ముఖ్యంగా అమేథిలో గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మను పోటీకి దింపి ఆయన విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని ఓడించి 2019లో రాహుల్ గాంధీ ఓటమికి రివేంజ్ తీర్చుకున్నారు.
Also Read..
PM Modi | ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం
Bomb Threat | ఢిల్లీ – టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు
Supriya Sule | బారామతి స్థానం సుప్రియా సూలేదే.. ఉత్కంఠ పోరులో వదినపై ఘన విజయం