KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్, తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్ కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ది ఇండియా వి ఇమాజిన్ ( మన ఊహల్లోని భారత్) అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు భారత్, దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు, పాలసీ మేకర్స్, సాంస్కృతిక రంగ నిపుణులు హాజరుకానున్నారు. గతంలో ఈ సదస్సుల్లో నీతా అంబానీ, నితిన్ గడ్కరీ, జైరాం రమేశ్, అజీమ్ ప్రేమ్‌జీ వంటి ప్రముఖులు హాజరై ప్రసంగించారు. తాజాగా కేటీఆర్‌కు కూడా ఈ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం అందడం విశేషం.
తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టడంలో కేటీఆర్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఆహ్వానం అందిందని నిర్వాహకులు ప్రెస్‌నోట్‌లో తెలిపారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో తొలి రోజు జరగబోయే సదస్సులో పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీలపై చర్చ జరగనుంది. ఇక రెండో రోజు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో బిజినెస్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, గ్లోబల్ ఎకానమీ అంశాలపై చర్చ జరగనుంది. రెండో రోజు జరిగే ఈ సమావేశంలోనే కేటీఆర్ ప్రసంగించనున్నారు.