Kisan Samman | హైదరాబాద్, జూన్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమసే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పంపిణీ చేసిన నిధుల కంటే పంటలకు మద్దతు ధర (ఎంఎస్పీ) చెల్లించకపోవడంతో రైతులకు జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కుటుంబంలోని ఒక రైతుకు ఏటా గరిష్ఠంగా రూ.6 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. అయితే వాస్తవానికి కేంద్రం ఒక వైపు రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు చెబుతూ మరోవైపు వారు పండించిన పంటలకు చాలా తక్కువ మద్దతు ధర ప్రకటిస్తూ బడా వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు (2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు) దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.42 లక్షల కోట్లు పంపిణీ చేసింది. కానీ 2015-16 నుంచి 2022-23 మధ్యకాలంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం వరి, గోధుమ పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో దాదాపు రూ.3 లక్షల కోట్లు రైతులు నష్టపోయారు. మరో 12 పంటలకు కూడా కేంద్రం ప్రకటించిన తక్కువ మద్దతు ధరల వల్ల జరిగిన నష్టాన్ని లెక్కేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తానిచ్చిన హామీని నెరవేర్చకుండా మద్దతు ధరను తక్కువగా ప్రకటిస్తూ రైతులకు చెల్లించాల్సిన ధరను చెల్లించకుండా మోసం చేస్తున్నది. అంతేకాకుండా మద్దతు ధర తక్కువగా ప్రకటిస్తూ బడా వ్యాపార సంస్థలకు లాభం చేకూరుస్తున్నది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మద్దతు ధరను లెక్కించకుండా అన్నదాతల కడుపుకొడుతూ, మరోవైపు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.6 వేలు పంపిణీ చేసి ప్రేమ ఒలకబోస్తున్నట్టు నటిస్తూ వారి ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నది.
ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించే పంటలకు అయ్యే ఖర్చుకు 50 శాతం అదనంగా మద్దతు ధర (ఎంఎస్పీ) ఉండాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022-23లో ప్రభుత్వం రైతుల నుంచి క్వింటాలుకు రూ.2040 చొప్పున 534 లక్షల టన్నుల ధాన్యాన్ని రూ.1.09 లక్షల కోట్లతో కొన్నది. కానీ స్వామినాథన్ సిఫారసుల మేరకు టన్ను ధాన్యం మద్దతు ధర రూ.2,708 ఉండాలి. ఈ మద్దతు ధరతో లెక్కించినట్లయితే రైతులకు రూ.1.50 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చేది.