తెలంగాణ అస్తిత్వం గురించిన చర్చలు మరొకమారు జరుగుతున్నందున ఈ విషయంపై చేయవలసిన ఆలోచనలు ఉన్నాయి. యథాతథంగానే అస్తిత్వం అనే మాట సాధారణమైనది కాదు. దాని లోతు, వైశాల్యం అపరిమితమైనవి. అందుకు ఇది అది అని గాక 360 డిగ్రీలుంటాయి. గతం, వర్తమానం, భవిష్యత్తు
అనే మూడు కాలాలతోనూ నిమిత్తం ఉంటుంది. దాని పరిధిలోకి రానిది ఏదీ ఉండదు. ఏది ఫిలాసఫీ, ఏది కాదు అనే ప్రశ్నకు ఏ విధంగానైతే నిర్దిష్టమైన నిర్వచనం చెప్పలేమో, ఏది అస్తిత్వం ఏది కాదు అనే ప్రశ్నకు కూడా అట్లా చెప్పడం సాధ్యంకాదు. అది అట్లుంచితే, ఈ చర్చలో తెలంగాణ సోషియాలజీ, అందులో వస్తున్న మార్పులపై చర్చ కూడా చాలా అవసరం. దాని గురించిన అవగాహన, కార్యాచరణ కూడా అస్తిత్వ పరిరక్షణకు తప్పనిసరి.
ఎందుకంటే, ఒక వ్యక్తి, లేదా సమాజం, లేదా ప్రాంతపు అస్తిత్వంలో సోషియాలజీ అనేది విడదీయరాని భాగం, అస్తిత్వంలో స్థూలంగా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఆ వ్యక్తి, సమాజం, ప్రాంతపు ఉనికి. అది భౌతికమైనది, భౌగోళికమైనది. ఆ ఉనికిలోకే చరిత్ర, సంస్కృతి వంటివి కూడా వస్తాయి. అవి గతంలో మొదలై, వర్తమానంలో కొనసాగుతూ, భవిష్యత్తులోనూ కొనసాగేవి. అటువంటి ఉనికి అనే దానికి ఒక స్థిరత్వం ఉంటుంది. ఈ ఉనికికి భిన్నమైన రెండవ అంశం ఆ వ్యక్తి, సమాజం, ప్రాంతపు మనుగడ. ఆ మాటకు అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే బాగోగులు.
గతంలో ఏ విధంగా జీవించేవారు? ఇప్పుడు ఎంత మెరుగ్గా జీవిస్తున్నారు? రానున్న కాలంలో ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నారు? అన్నది. ఈ మాట వ్యక్తులకు, వారి సమాజానికి కూడా వర్తిస్తుంది. ఇక ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడి అభివృద్ధి, సమస్యలు, వాటి పరిష్కారానికి జరిగే ప్రయత్నాలు, కాలానుగుణమైన పురోగతి గతంలో ఎట్లుండేవి? వర్తమానంలో ఎట్లున్నాయి? మునుముందు ఎట్లా ఉండగల అవకాశాలు ఉన్నాయి? అనే పరిస్థితి అన్నమాట. ఇదంతా కలిపి మనుగడ అనుకుంటే, ఉనికికి ఒక స్థిరత్వం ఉన్నట్టుగా ఈ మనుగడకు మాత్రం స్థిరత్వమనేది ఉండదు. అది నిరంతర చలనశీలం.
ఆ విధంగా మనుగడతో, దాని చలనశీలతతో ముడిబడి ఉన్నదే సోషియాలజీ. మనుగడ వలెనే సోషియాలజీ కూడా చలనశీలమైనదే. అయితే ఇక్కడ కొద్దిగా వివరణ అవసరం. ఒక సమాజానికీ, అందులోని వ్యక్తులకు గతం నుంచి ఉండే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనా రీతుల నుంచి మౌలికమైన సోషియాలజీ ఒకటి ఏర్పడుతుంది. కానీ అది మనం పైన చెప్పుకొన్న ఉనికి వలె స్థిరమైనది కాదు. మనుగడకు సంబంధించిన అంశాలు ఏ విధంగా చలనశీలమైనవో, వాటితో ముడిబడి ఉండే సోషియాలజీ అంశాలు కూడా చలనశీలమైనవే.
ఇదంతా చెప్పుకోవటం ఎందుకంటే, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వానికి హాని కలుగుతుండటం పట్ల ఆందోళన చెందుతున్న ఆలోచనాపరులు, తెలంగాణ ఉనికి గురించి కలవరపడాల్సింది ఏమీ లేదు. కానీ తెలంగాణ మనుగడ పరిస్థితుల గురించి, అందుకు అనుబంధం వంటిదైన సోషియాలజీ గురించి ఆలోచించవలసి ఉన్నది. మనుగడ గురించి చర్చలు జరుగుతున్నాయి కూడా. తెలంగాణ ప్రయోజనాలు, ఇక్కడి ప్రజల బాగోగులు దెబ్బతినే విధంగా ఎటువంటి మార్పులు క్రమంగా వస్తున్నాయనేది వారి చర్చల్లో ప్రతిఫలిస్తున్నది. ఈ చర్చలు ఇంకా జరగటం, యువతరంలోకి, ప్రజల్లోకి వ్యాపించటం, గతంలో క్రియాశీలంగా ఉండి స్వరాష్ట్ర సాధన తర్వాత నిర్లిప్తంగా మారిన వారు తిరిగి క్రియాశీలురు కావటం వంటివి అవసరం. చర్చల్లోకి ఇంకా ప్రస్తావనకు రావలసిన అంశాలు అనేకం ఉన్నందున అవి కూడా క్రమంగా రాగలవని భావించవచ్చు.
అయితే, గుర్తించవలసింది ఒకటున్న ది. అది పైన చెప్పుకొన్నట్టు తెలంగాణ సోషియాలజీ ఏమిటి? అందులో వస్తున్న మార్పులేమిటన్నది. పైన అనుకున్నట్టు మనుగడ, సోషియాలజీ అన్నవి రెండూ పరస్పర సంబంధం గలవి. రెండూ చలనశీలమైనవి. ఈ మాట కొంత సులభంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఉదాహరణకు మనిషి మనుగడ కోసం నెలకు రూ.10 వేలు ఆదాయం అవసరం అనుకుందాం. తెలంగాణ రాష్ర్టానికి ముందు అందులో సగం మాత్ర మే వస్తుండగా ఇప్పుడు రూ.10 వేలు లభించి తన మనుగడకు హామీ లభించిందని అనుకుం దాం.
కానీ మనిషి ఎప్పుడూ కనీస మనుగడకు హామీతో సంతృప్తి చెంది ఆగిపోడు. భవిష్యత్తు గురించిన ఆలోచన అనే సోషియాలజీ తనను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావం వల్ల నిన్నటి సంతృప్తి అన్నది చెదిరిపోయి కొత్త ఆకాంక్షలు, ల క్ష్యాలు మొదలవుతాయి. దానిని వ్యక్తి సోషియాలజీ అనవచ్చు. సమాజపు సోషియాలజీ కూడా అదే అవుతుంది. అందుకు విస్తృత రూపం అవుతుంది. క్రమంగా గత కాలపు సోషియాలజీ స్థా నంలో కొత్త ఆలోచనాసరళి వచ్చి చేరుతుంది. ఆదాయాలు, వాటిలో మార్పులు, వాటికి ముడిబడిన ఆలోచనలు అనేవి నిజానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇదే ఇంకా అనేకానేక విషయాలకు, రంగాలకు, సామాజిక, ఆర్థిక తరగతులకు వర్తిస్తుంది. అన్నీ కలిపి సోషియాలజీ అవుతుంది.
అందువల్ల ఆలోచనాపరులు గమనించాల్సినది ఏమిటంటే, అస్తిత్వ పరిరక్షణకు కావలసింది, అందుకు ఫలానా ఫలానా విధాలుగా భంగం కలుగుతున్నదని భావిస్తున్న అంశాల గురించి చర్చించటం మాత్రమే కాదు. ఆయా అంశాలు ప్రస్తుత రాష్ట్ర పరిపాలనకు, బయటి శక్తులకు సంబంధించినవి. కానీ ఈ అంశాల చర్చ ఎంత అవసరమో, మరొకవైపు తెలంగాణ సమాజంలో అంతర్గతంగా వస్తున్న సోషియాలజీ మార్పుల గురించిన చర్చ కూడా అంతే అవసరం. ఆ మార్పుల ప్రభావం పెరిగే కొద్దీ ఇంతవరకు ఉండిన అస్తిత్వ భావనల ప్రభావం తగ్గుతుంది. అప్పుడు అస్తిత్వానికి హాని కలిగించే పరిణామాలను, శక్తులను ప్రతిఘటించటం కూడా తగ్గుతుంది. ఈ ప్రభావాలు, తగ్గుదలలు ఒక్కోసారి పైకి స్పష్టంగా కనిపించవచ్చు. ఒక్కోసారి మనకు తెలియకుండానే చాపకింద నీరు వలె వ్యాపించవచ్చు.
తెలంగాణ అస్తిత్వానికి ఎంతో మౌలికమైనవి, ఇంతవరకు చర్చల్లోకి రానివి కూడా అనేకం ఉన్నాయి. అందులో రెండు ఉదాహరణలను మాత్రం ఇక్కడ చూద్దాం. ప్రపంచంలో గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలు, సమాజాలు గానీ, భారతదేశంలోని కొన్ని రాష్ర్టాలు గానీ అక్షరాస్యత, పాఠశాల విద్య, పేద పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అదే విధంగా జరగటం తెలంగాణ అస్తిత్వానికి, మనుగడకు సోషియాలజీకి ఒక దీర్ఘకాలిక అవసరం. కానీ, పేద పిల్లలు లక్షలాదిగా చదువుతున్న మన ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, అక్కడ టీచర్ల విద్యా బోధనలు, పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నాయో తెలిసిందే. ఎనిమిదవ తరగతికి వచ్చిన పిల్లలు నాలుగో తరగతి పాఠాలు, లెక్కలు కూడా చెప్పలేకపోతున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి.
సంవత్సరాల తరబడి పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది. తెలంగాణ అస్తిత్వానికి, మనుగడకు, సోషియాలజీకి, భవిష్యత్తుకు లక్షలాది పేద పిల్లల చదువుల స్థాయిలో బలమైన పునాది పడనట్టయితే అది బలహీనమైన, పాక్షికమైన అస్తిత్వం మాత్రమే అవుతుంది. అందువల్ల, అస్తిత్వపు ఆలోచనలు ఇటువంటి స్థాయిలో కూడా జరిగి, టీచర్లను, పిల్లల తల్లిదండ్రులను అస్తిత్వ స్పృహతో వ్యవహరించేట్టు చేయటం అవసరం. తెలంగాణ అస్తిత్వానికి భంగకరమయ్యేవి ఆర్థిక సంబంధమైన రంగాల్లోనే కాదు, ఇటువంటి ఇతర రంగాల్లోనూ జరగకుండా ఉండాలి. అందుకోసం ఈ అస్తిత్వ ఆందోళనలు, ఆలోచనల పరిధి క్రమంగా మౌలిక స్థాయికీ విస్తరించితేనే తెలంగాణ మనుగడ, సోషియాలజీ సార్థకం, దీర్ఘకాలికం అవుతాయి.
ఇటువంటిదే మరొక ఉదాహరణ తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా వ్యక్తి సంబంధాలు, కుటుంబ సంబంధాలు, వేర్వేరు విలువలు ఆర్థిక సంబంధాలు దెబ్బతిని పోతుండటం. చివరకు గ్రామీణ సాధారణ కుటుంబాల్లోనూ ఆర్థిక అంశాలపై హత్యలు, ఆత్మహత్య లు పెరుగుతుండటం. ఇతరత్రా అభివృద్ధి ఎట్లు న్నా లేకున్నా చదువులు పైన చెప్పిన విధంగా, సమాజ సంబంధాలు, విలువలు ఈ విధంగా ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వం అన్నది పునాదుల స్థాయి నుంచి ఏ విధంగా నిర్మితం అవుతున్నట్టు? ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే.
మొ దట అనుకున్నట్టు అస్తిత్వానికి 360 డిగ్రీలు, గతం-వర్తమానం-భవిష్యత్తు ఉంటాయి. అందువల్ల అస్తిత్వం అనేది ఒక మహాయజ్ఞం. ఆలోచనాపరుల సంఖ్య, పరిధి ఎంత విస్తరించి, వారు ఎం త దీక్షతో ఇందుకోసం పూనుకుంటే, తెలంగాణ అస్తిత్వం అంత మౌలికంగా అర్థవంతంగా సమగ్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ యజ్ఞం స్వరాష్ట్ర సాధన యజ్ఞానికి మించినది. ఉనికితో ముడిబడిన రాష్ట్ర సాధన లక్ష్యం 2014తోనే నెరవేరిపోయింది. సరైన మనుగడ, సోషియాలజీల లక్ష్యం కోసం కృషి అనంతంగా సాగాల్సి ఉన్నది.
తెలంగాణ అస్తిత్వానికి ఎంతో మౌలికమైనవి, ఇంతవరకు చర్చల్లోకి రానివి కూడా అనేకం ఉన్నాయి. అందులో రెండు ఉదాహరణలను మాత్రం ఇక్కడ చూద్దాం. ప్రపంచంలో గొప్పగా అభివృద్ధి చెందిన దేశాలు, సమాజాలు గానీ, భారతదేశంలోని కొన్ని రాష్ర్టాలు గానీ అక్షరాస్యత, పాఠశాల విద్య, పేద పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అదే విధంగా జరగటం తెలంగాణ అస్తిత్వానికి, మనుగడకు సోషియాలజీకి ఒక దీర్ఘకాలిక అవసరం.
-టంకశాల అశోక్