(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఒకవైపు యుద్ధం, మరోవైపు ప్రకృతి సంక్షోభం, ఇంకోవైపు కేంద్రం అసమర్థ విధానాలు వెరసి ఎన్నడూచూడని స్థాయిలో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. జీఎస్టీ పేరిట కేంద్రం ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న పన్నులకు తోడు ఇంధన ధరల మంటతో వంటనూనె, బియ్యం, గోధుమ, కంది పప్పు తదితర నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఫిబ్రవరి 28 నుంచి ఆగస్టు 3 మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలోనే వంటింట్లో వాడే సరుకుల ధరలు 5 శాతం నుంచి 40 శాతం మేర పెరిగాయి.
భవిష్యత్తులోనూ తిప్పలు
కేంద్రప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, పాలసీలు ఘోరంగా విఫలమవ్వడంతో భవిష్యత్తులోనూ నిత్యావసరాల ధరల ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశంలో పంటల సాగు ఇప్పటికే మందగించింది. నిరుడు వానకాలంతో పోలిస్తే, ఈ ఏడాది ఖరీఫ్ పంట విస్తీర్ణం జూలైలో 7 శాతం మేర తగ్గినట్టు మార్కెట్‌వర్గాలు తెలిపాయి. దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి.. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా వస్తు ధరలు పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక, రానున్నది పండుగల సీజన్. ఈ నెలతో మొదలై వరుసగా రక్షా బంధన్, జన్మాష్టమి, గణేశ్ చతుర్ధ్ది, బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్ తదితర పండుగలు వరుసగా రానున్నాయి.
రానున్న రోజుల్లో కష్టమే
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు ధాన్యం ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో బియ్యం, పప్పులతో పాటు వంటనూనెల ధరలు మరింతగా పెరుగొచ్చు. భారత్ చమురుతో పాటు వంట నూనెల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధాల నేపథ్యంలో ఈ దిగుమతులు కూడా భారంగా మారొచ్చు. మొత్తంగా రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నది.
– డాక్టర్ మనోరంజన్ శర్మ,చీఫ్ ఎకానమిస్ట్, ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్
అమాంతం పెరిగిన బియ్యం ధరలు
గత కొన్ని వారాలుగా దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు 10 శాతానికిపైగా పెరిగాయని ‘ది వైర్’ పేర్కొన్నది. స్వర్ణ రకం బియ్యం ధర క్వింటాలుకు రూ. 30 నుంచి రూ.34కు పెరిగి, సుమారు 13శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. 2025-26 పంట సంవత్సరంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో బియ్యం లభ్యత తక్కువగా ఉండటం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
పంచదార ధరకూ రెక్కలు
పంచదార ధరలు 8 నుంచి 15 శాతం వరకు భారీగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.400 వరకు పెరగడం, రాబోయే సీజన్లో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండటంతో పండుగ సీజన్లో తీపి రుచి వినియోగదారులకు భారంగా మారనున్నది. ప్రధాన నగరాల్లో రిటైల్ ధరల వివరాలను పరిశీలిస్తే ఢిల్లీలో రూ. 45 నుంచి రూ.49కి, ముంబైలో రూ.46 నుంచి రూ.52కు పెరిగాయి.