West Bengal | కోల్కతా, ఆగస్టు 29: పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవలి వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు 21 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అసాధారణరీతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు.
బాధితురాలికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు బెంగాల్ తగలబడితే ఢిల్లీ సహా పలు రాష్ర్టాలు తగలబడతాయని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తున్నది. ఇవి దేశవ్యతిరేక వ్యాఖ్యలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజందార్ ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పదేపదే కోరుతున్నారు. ఇటీవల బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రి ని కలిశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘గవర్నర్గా అన్నీ చూస్తున్నా. నా నిర్ణయాలు ప్రజల్లో చెప్పడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు, అసాధారణంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు గవర్నర్ను కలిసి రాష్ర్టాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వరుస పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మరోవైపు, ‘బెంగాల్ తగలబడితే ఢిల్లీ కూడా తగలబడుతుందని గుర్తుంచుకోండి’ అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను దాచిపెట్టేందుకు దవాఖాన వర్గాలు ప్రయత్నించిన తీరు కాల్ రికార్డింగులతో బయటకొచ్చింది. ఘటన జరిగిన ఆగస్టు 9న బాధితురాలి తండ్రికి ఆర్జీ కర్ వైద్య కళాశాల, దవాఖాన అసిస్టెంట్ సుపరింటెండెంట్ ఫోన్ చేశారు. ‘మీ కూతురికి ఆరోగ్యం బాగోలేదు. మేము దవాఖానలో చేరుస్తున్నాం. మీరు దవాఖానకు రండి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరోసారి ఫోన్ చేసి ‘మీ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకొని ఉండవచ్చు. మీరు త్వరగా రండి’ అంటూ చెప్పాడు. తర్వాత కొంతసేపటికే మరోసారి ఫోన్ చేసి..‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుంది.’ అంటూ మరణవార్తను చెప్పారు.