న్యూఢిల్లీ: జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి(BR Gavai) ఇవాళ 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ఇవాళ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పాల్గోన్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తొలి బుద్దిస్టు, రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డుకెక్కారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24వ తేదీన ఆయన జన్మించారు. అంబేద్కర్ సూత్రాలను అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు. జస్టిస్ బీఆర్ గవాయి తండ్రి ఆర్ఎస్ గవాయి. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ నేత. బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా చేశారు.
మంగళవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగుతారు. 2025 నవంబర్ 23న సీజేఐగా ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం.
LIVE: Swearing-in-Ceremony of the Chief Justice of India Shri Justice Bhushan Ramkrishna Gavai at Rashtrapati Bhavan https://t.co/KSRP8wDqpz
— President of India (@rashtrapatibhvn) May 14, 2025