ఢిల్లీ, మార్చి 29: ప్రకృతిలో సహజంగా లభించే వనరులను వినియోగించే ముందు తన తండ్రి క్షమాపణలు కోరేవారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. చెట్లను నరికే ముందు, దుక్కి దున్నే ముందు క్షమాపణలు అడిగేవారని పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ పర్యావరణ సదస్సు-2025ను రాష్ట్రపతి ముర్ము శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ఆమె సందేశమిచ్చారు. ‘చెట్లు బతికున్నంత కాలం పూలు, పండ్లు ఇస్తాయని, మోడువారాక కూడా మనకు ఉపయోగపడుతున్నాయని మా నాన్న చెప్పారు’ అని తన చిన్ననాటి జ్ఞాపకాలను రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని, ఈ సదస్సులో దానికి సమాధానం కనుగొనాలని ఆమె సూచించారు. పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఆరు బయట మాస్కులు వేసుకుని ఆడుకునే వాతావరణాన్ని పిల్లలకు కల్పించరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని నివారించడానికి కాలుష్య కారకాల నియంత్రణ, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే టెక్నాలజీల ఉపయోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఆర్థిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉండే విధంగా పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు. గ్రీన్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆరుబయట మాస్కులు వేసుకుని ఆడుకునే వాతావరణంలో మన పిల్లలు పెరగకూడదని ఆయన అన్నారు.