Prashant Kishore : రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, తమ పార్టీ జన్ సురాజ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ మిషన్‌ను ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ ఇప్పటికే నిర్వీర్యమైందని, ఆ పార్టీ టైర్‌కు పంక్చర్ అయిందని పేర్కొన్నారు. ఆర్జేడీ ఎన్నడూ ఎన్నికల్లో సొంతంగా గెలవలేదని, ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ముస్లింలు తమను ఎక్కువగా మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది ఆర్జేడీయేనని అర్ధం చేసుకున్నారని చెప్పారు.
జన్ సురాజ్ మిషన్ రాజకీయ పార్టీగా పోషించే పాత్రపై ప్రశాంత్ కిషోర్ స్పష్టత ఇస్తూ బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ సహా అన్ని పార్టీలకు చెందిన సానుభూతిపరులు రాష్ట్రంలో సమూల మార్పు కోరుతున్నారని అన్నారు. వీరందరి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పడుతూ జన్ సురాజ్ పార్టీ రూపు సంతరించుకుంటుందని చెప్పారు. నితీష్ కుమార్ రాజకీయ ప్రస్ధానం ముగింపు దశకు చేరుకుందని అన్నారు.
ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూసినప్పుడు ఆ పార్టీ నేతలు సాయం కోసం తనను ఆశ్రయించారని, తాను ఆయనకు సాయం చేయని పక్షంలో నితీష్ కుమార్, జేడీయూ ఇప్పుడు ఎక్కడ ఉండేవో తనకు తెలిసేది కాదని వ్యాఖ్యానించారు. జన్ సురాజ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని, రాష్ట్ర రాజకీయాల్లో ప్రబల శక్తిగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
People power | ప్రజలు ఆగ్రహిస్తే పదవులు గల్లంతే.. 20 ఏండ్లలో 10 మంది దేశాధినేతలకు పదవీ వియోగం..!