People power | గడిచిన పదిహేనేళ్ల నుంచి బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్న షేక్ హసీనా.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో గద్దె దిగాల్సి వచ్చింది. గత సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె భారత్‌కు వచ్చి ఆశ్రయం తీసుకున్నారు. అయితే ఇలా ప్రజల ఆందోళనలతో దేశాధినేతలు పదవి కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. గత 20 ఏండ్లలో వివిధ దేశాలకు చెందిన 10 మంది అధినేతలు ఇదేవిధంగా తమ పదవులను కోల్పోయారు. ఆ వివరాలను ఒకసారి చూద్దాం..
2024 ఆగస్టు: హసీనా రాజీనామా
ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో నిరసనలు రేగడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు పారిపోయారు.
2022 : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవటంతో శ్రీలంకలో నిరసన జ్వాలలు చెలరేగాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికార నివాసాన్ని నిరసనకారులు చుట్టుముట్టడంతో 2022 జూలైలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు.
2017: రాబర్ట్ ముగాబే
జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా 2017 నవంబర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. సైన్యం జోక్యం చేసుకొని ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించింది.
2018: అర్మేనియా ప్రధాని సార్గిసన్
ప్రధాని సెర్జ్ సార్గిసన్ పాలనకు 2018 ఏప్రిల్ 23న తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిరసనకారులు, సైన్యం చేతులు కలిపి.. పదవి నుంచి సెర్జ్ సార్గిసన్ను తప్పించారు.
2013: బల్గేరియా ప్రధాని బోరిసోవ్
పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా బల్గేరియాలో నిరసనలు రేగాయి. 2013 ఫిబ్రవరిలో ప్రధాని బోరిసోవ్ రాజీనామా చేశారు.
2011: హోస్ని ముబారక్
ఈజిప్ట్‌లో హోస్ని ముబారక్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగడంతో 2011 ఫిబ్రవరిలో ముబారక్ తప్పుకున్నారు.
2011: అబిదిన్ బెన్ అలీ
నిరుద్యోగం, ధరలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో 2011 జనవరి 15న ట్యునీషియా అధ్యక్ష పదవికి అబిదిన్ బెన్ అలీ రాజీనామా చేసి సౌదీకి పారిపోయారు.
2009: ఐస్‌ల్యాండ్ ప్రధాని హార్డే
దేశ కరెన్సీ, బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలటంతో ప్రజలు ఆందోళనకు దిగడంతో ఐస్‌ల్యాండ్ ప్రధాని పదవికి హార్డే రాజీనామా చేశారు.
2006: నేపాల్ రాజు జ్ఞానేంద్ర
రాచరిక వ్యవస్థపై ప్రజాగ్రహం పెల్లుబుకడంతో నేపాల్ రాజు జ్ఞానేంద్ర గద్దె దిగాల్సి వచ్చింది.
2005: ఒమర్ కరామి
మాజీ ప్రధాని రఫిక్ హారిరి హత్యతో లెబనాన్‌లో నిరసనలు మిన్నంటడంతో ప్రధాని ఒమర్ కరామి రాజీనామా చేయాల్సి వచ్చింది.