పాట్నా: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor).. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ కన్ఫర్మ్ చేశారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహాగానాలకు ప్రశాంత్ కిషోర్ బ్రేక్ వేశారు. తానేమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కేవలం పార్టీ వర్క్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు ఇవాళ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
అయితే రఘోపూర్ నియోజకవర్గానికి జన్ సూరజ్ పార్టీ చంచల్ సింఘ్ అభ్యర్థిని ప్రకటించడంతో ఆ డౌట్ క్లియర్ అయ్యింది. స్వంత నియోజకవర్గం కార్గహర్ లేదా రఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో కిషోర్ చెప్పారు. కానీ ఫస్ట్ లిస్టులో ఆయన కార్గహర్ టికెట్‌ను రితేశ్ రంజన్‌కు ఇచ్చారు.
పార్టీ వ్యవహారాలపై మాత్రం ఫోకస్ పెట్టాలని, పోటీ చేయవద్దు అని జన్ సూరజ్ పార్టీ నిర్ణయించినట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో జన్ సూరజ్‌కు 150 సీట్లు రాకుంటే, అప్పుడు దాన్ని ఓటమిగానే పరిగణిస్తానన్నారు.
బీహార్‌లో ఈసారి ఎన్డీఏ కూటమి ఓడిపోనున్నట్లు కిషోర్ తెలిపారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావలన్నారు. నితీశ్ ఈసారి సీఎం కాలేరన్నారు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనున్నది.