(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్‌లో తరచూ పర్యటిస్తున్నారు. రాజధాని పాట్నాలో బుధవారం ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దీంతో అక్కడి రాజకీయ నాయకులు రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీహార్ ప్రజలను కించపరిచిన రేవంత్‌ను.. ప్రజలు తరిమి కొడతారు’ అంటూ జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్ రెడ్డి ఎవరు? బీహార్‌లో ఆయనకు ఏం పని?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడారు.
బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరిట ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులూ చేపట్టింది. అయితే, ఎస్ఐఆర్లో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా బీహార్‌లోని పార్టీ క్యాడర్లో ఆత్మ విశ్వాసం నెలకొల్పడమే లక్ష్యంగా బుధవారం కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీహార్‌లో తొలిసారిగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ కూడా పాల్గొన్నారు. దీనిపై మీడియా ప్రశాంత్ కిషోర్‌ను ప్రశ్నించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గతంలో బీహార్ ప్రజలను అవమానించారని, ఇప్పుడు ఏ ముఖంతో ఓట్లను అడగడానికి వచ్చారని ప్రశాంత్ కిశోర్ తీవ్రస్థాయిలో
ధ్వజమెత్తారు.
‘రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు బీహార్‌లో పనేంటి? కూలి పని అనేది బీహారీల డీఎన్ఏలోనే ఉందని మా ప్రజలను కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు ఏ ముఖంతో ఓట్లు అడగడానికి వచ్చారు? రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా ప్రజలు, యువకులు ఆయన్ని తరిమి కొడతారు. రేవంత్‌ను బాయ్‌కాట్ చేయాలి’ అని ప్రశాంత్ కిషోర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, హర్యానాలో బీహారీలపై దాడులు జరుగుతున్నాయని, ఎంతోమంది బీహారీలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.