Supreme Court | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. కాలుష్యం నియంత్రణకు ఎన్సీఆర్లోని రాష్ట్రాలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఏం చేశారంటూ సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేయడానికి కొంత తక్షణ అవసరమని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్కు సుప్రీంకోర్టు చెప్పింది. నాల్గో విడత ఎలాంటి ఆదేశాలు అడగకుండా తొలగించొద్దని కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4ని తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్సీఆర్ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆంక్షలను పర్యవేక్షించేందుకు తక్షణమే టీమ్లను ఏర్పాటు చేయాలని చెప్పింది. జీఆర్పీలో పేర్కొన్న చర్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. తదుపరి విచారణ వరకు నివారణ చర్యలను కోర్టుకు సమర్పించాలని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 కంటే తక్కువకు పడిపోయినప్పటికీ.. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యాక్షన్ ప్లాన్ అమలు కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం ఇందుకు సమ్మతి తెలుపుతూ నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. కాలుష్యం లేని వాతావరణంలో జీవించడం ప్రజల హక్కు అని.. ఈ మేరకు పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, పిటిషన్ తరఫు న్యాయవాది విద్యార్థుల తరగతులపై కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా.. 12 తరగతి వరకు తరగతులను నిలిపివేయాలని చెప్పింది.