అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో 93 మంది మహిళలు ఉన్నారు. 2.14 కోట్ల మంది ఓటువేయనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 2017లో పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77, ఆప్‌కు 20, ఎస్ఏడీ–బీజేపీకి 18 సీట్లు వచ్చాయి.
పంజాబ్‌లో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఈసారైనా సీఎం సీటును సొంతం చేసుకోవాలని చూస్తున్నది. ఈ రెండు పార్టీలు సొంతంగా పోటీచేస్తుండగా, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ బీఎస్పీతో జట్టుకట్టగా, వివాదాస్పద సాగుచట్టాలు తీసుకొచ్చి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ నేతృత్వంలోని ఎస్ఏడీ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.
ఈ ఎన్నికల్లో సీఎం చన్నీ చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ స్థానాల నుంచి పోటీచేస్తుండగా, ధురి నియోజకవర్గం నుంచి ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్, అమృత్సర్ తూర్పు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పటియాలా అర్బన్ నుంచి మాజీ సీఎం అమరీందర్ సింగ్, జలాబాబాద్ నుంచి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ బాదల్, లంబీ స్థానం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్నారు.