West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం. వచ్చే వేసవిలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కొత్తగా రానున్న వాటిలో ఎనిమిది అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఒక వందేభారత్ స్లీపర్ రైలు ఉన్నాయి.
ఇవి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర ప్రదేశ్, రాష్ట్రాలను కలుపుతాయని రైల్వే శాఖ తెలిపింది. వీటిలో ఎక్కువ రైళ్లను ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుహవటి నుంచి కోల్ కతా వెళ్లే వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని, రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారవుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు వారాల్లో ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని, జనవరి 18 లేదా 19 తేదీల్లో ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశాలున్నాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. వందే భారత్ రైలులో 16 కోచులుంటాయివ.
11 థర్డ్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. మొత్తంగా 823 మంది ప్రయాణించే వీలుంది. ఈ స్లీపర్ రైలు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందింది. అయితే, ప్రస్తుతం రైలు 120-130 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తుంది. మిగతా అమృత్ భారత్ రైళ్లు, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇతర రాష్ట్రాల మధ్య ప్రయాణిస్తాయి. అవన్నీ ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.